నవీనము

17, జనవరి 2016, ఆదివారం

మానవత్వం మరిచి నిర్దయగా ప్రవర్తిస్తే



ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఘనంగా జరుగుతోంది.
అదే దారిలో వెళుతున్న ఓ ముసలాయన, అక్కడ భోజనాలు పెడుతున్న ఒక వరుస చివరిలోకి వెళ్ళి కూర్చున్నాడు.
పెళ్ళి కొడుకు తండ్రి సుబ్బరామయ్య అక్కడ అందరినీ పలకరిస్తూ వస్తున్నాడు.
ఆ ముసలాయనకు అరిటాకు వేసి, ఖచ్చితంగా వడ్డించే టైం లో సుబ్బరామయ్య అక్కడికొచ్చి, ముసలాయనను భోజనాల దగ్గర నుండి లేచి పొమ్మని గట్టిగా అరుస్తూ మెడపట్టి బయటకు గెంటాడు.
గట్టిగా విసురుగా తోయడంతో ఆ ముసలాయనకు పక్కనే ఉన్న కిటికీ తగలడంతో ముక్కు నుండి రక్తం కారింది.
ప్రక్క వరుసలో భోజనాలు వడ్డిస్తున్న సుబ్బరామయ్య బావమరిది నరసయ్య వెంటనే ఆ ముసలాయనను బయటకు తీసుకెళ్ళి ఖర్చీప్ ను తడిపి ముక్కు వద్ద ఉంచి , పక్కనే ఉన్న ఒక వ్యక్తికి ఒక కవర్లో స్వీట్లు తెమ్మని చెప్పి, ఆ కవర్ ను ముసలాయనకు ఇచ్చి పంపాడు.
పెళ్ళి అయిపోయాక, సాయంత్రం సుబ్బరామయ్య ఖర్చుల పట్టీలన్నీ చూసుకుంటూ ఓ గదిలో కూర్చుని ఉండగా, నరసయ్య అక్కడికెళ్ళి , " బావా....! అందరూ నిన్ను గొప్పగా అనుకోవాలని లక్షలు ఖర్చుపెట్టి పెళ్ళి చేసావు.బాగానే ఉందిగానీ, ఆ ముసలాయన భోజనం చేస్తూ ఉంటే, ఎందుకలా..... మెడపట్టి గెంటావు.
అది చూసి, అక్కడ భోజనాలు చేస్తున్న వారంతా నిన్ను ఎంతగా అసహ్యించుకున్నారో......., ఎంతగా విమర్శించారో.............తెలుసా...... అని బాధగా కోపంగా ఉన్నాడు.
దానికి సుబ్బరామయ్య, " ఆ ముసలాయన మాసిన బట్టలతో వచ్చి, అందరిలో భోజనాల ప్రక్కన కూర్చునే సరికి, అక్కడందరూ ఏమనుకుంటారేమోనని అలా చేసాను " అని చెప్పాడు.
" నువ్వు అతని మాసిన బట్టలనే చూసావుగానీ, ఆ బట్టల వెనుక ఉన్న అతని కడుపులోని ఆకలిని అర్థం చేసుకోలేకపోయావు.ఎంత ఆకలిగా లేనిది , అలా వచ్చి భోజనాల దగ్గర కూర్చుంటాడా....! అని ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే, పెళ్ళికి వచ్చిన వారంతా నిన్ను తప్పుబట్టే వారు కాదు కదా....! కనీస మానవత్వం లేకుంటే మనం మనుషులమని ఎలా అనిపించుకుంటాం బావా....! అని ఒకింత ఆవేదనతో మాట్లాడుతూ నరసయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
తాను చేసింది తప్పేనని అర్థం చేసుకొని సుబ్బరామయ్య అక్కడే కూర్చుని ఆలోచనలో పడిపోయాడు.
ఎంతటి కోటీశ్వరుడివైనా, లక్షలు ఖర్చు పెట్టగల స్థోమత ఉన్నా మానవత్వం మరిచి నిర్దయగా ప్రవర్తిస్తే అందరూ అసహ్యించుకుంటారు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy