నవీనము

30, మార్చి 2016, బుధవారం

ఒకరోజు భగవాన్ రమణమహర్షి తన ఆశ్రమంలోని వంటిగదికి వెళ్ళారు.





గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు _/:\_యందు సేకరణ
ఒకరోజు భగవాన్ రమణమహర్షి తన ఆశ్రమంలోని వంటిగదికి వెళ్ళారు. అక్కడ నేలమీద బియ్యపుగింజలు పడి ఉండడం చూశారు. ఆయన వెంటనే కింద కూర్చుని వాటిని ఒక్కొక్కటిగా ఏరడం మొదలు పెట్టారు. కాసేపటికి అక్కడికి ఆయన శిష్యులు వచ్చారు. తమ గురువుగారు నేలమీద కూర్చుని బియ్యం గింజలు ఏరుతుండడం చూసి విస్తుపోయారు. ఆత్మజ్ఞానం కోసం ఇంటినీ, తల్లినీ, ఇతర బంధువులను విడిచిపెట్టి వచ్చిన రమణమహర్షి ఇలా బియ్యపుగింజల్ని ఏరడం ఏమిటా అని వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కున్నారు. ఉండబట్టలేక వారు ఆయనవద్దకు వెళ్ళి "స్వామీ, నేలమీద పడిపోయిన కొన్ని బియ్యపుగింజలకి ఇంత ప్రాధాన్యమివ్వాలా? మన ఆశ్రమంలోబియ్యపు బస్తాలకు ఏ మాత్రం కొరత లేదు కదా?" అని ఆయనను మెల్లిగా అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి - "మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా చూడటం సరికాదు. వీటి లోపల ఏమేమున్నాయో చూడగలగాలి. మీకెవ్వరికీ అన్నదాత శ్రమ కనిపించడం లేదా? సూర్యుడి వెలుగు కనిపించడం లేదా? హాయినిచ్చే గాలి లేదా? మృదువైన మట్టి లేదా? ఇలాంటివేవీ చూడలేకపోతున్నందువల్లె మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా అనుకుంటున్నారు. కానీ నేను చెప్పినవన్నీ వీటిలో కనిపించి ఉంటే కిందపడిపోయిన ఈ బియ్యపుగింజల్ని ఏరాలా? అని నన్ను అడిగేవారు కాదు. ప్రతి బియ్యపుగింజకూ భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి పరచిపోకండి. అందుకే అంటున్నా...మీరు ఈ వాస్తవాన్ని విస్మరించకండి...ఎప్పుడైనా సరే మీ పాదాలతో వాటిని తొక్కి వృథా చేయకండి. నేలమీద పడిన బియ్యపు గింజలను భద్రపరచి తినడం ఇష్టం లేదనుకుంటే వాటిని పక్షులకైనా వెయ్యండి. అవి ఎంతో తృప్తిగా తింటాయి..." అని. ఆయన మాటలు విన్న తర్వాత శిష్యులు ఇక నోరెత్తితే ఒట్టు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy