నవీనము

10, జనవరి 2016, ఆదివారం

ముత్యాలు-భగవంతుడు



ఓ మంచి కధ.... చదవండి.
ఒక పాప దగ్గిర పెట్టెలో కొన్ని ముత్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వుండేది. ఒకరోజు ఆ పాప పడుకుని వుండగా తండ్రి పక్కనే కూర్చుని, “నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా....?!” అని అడిగాడు.
“అవంటే నాకిష్టం డాడీ. నేను పెద్దవుతున్నాగా... కావాలంటే నా బేబీ డాల్ తీసుకో....!” అంది.
“థాంక్యూ... వద్దులే అమ్మా... ఐ లవ్యూ...!” అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు తండ్రి.
అయిదు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పక్కమీద పాప పడుకుని వుండగా, తండ్రి వచ్చి పక్కన కూర్చొని “నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ....?!” అని అడిగాడు.
“సారీ డాడీ... కావాలంటే నా సైకిల్ తీసుకో... పెద్దయ్యాగా....!” అంది.
“వద్దులే అమ్మా....! థాంక్యూ.... డాడీ లవ్స్ యు....!” అని వెళ్లిపోయాడు. అలా కొంత కాలం గడిచింది.
ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి దేవాలయానికి వెళ్లింది. అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా వింది.
ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ.... “తీసేసుకో డాడీ. నాకివీ అవసరంలేదు....!” అంది.
అప్పుడా తండ్రి జేబులోనుంచి అలాంటి పెట్టేనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ “వీటిని నీకిద్దామని ఎప్పటినుంచో నా దగ్గిరే వుంచుకున్నాను. ఇవి నిజమైన ముత్యాలు. ఇప్పటివరకూ నువ్వు భద్రంగా దాచుకున్నవి నకిలీవి తల్లీ...!” అంటూ కూతురికి అందించాడు అసలైన ముత్యాలని.
ముందువాటి కన్నా ఇవి ఎంతో స్వచ్ఛంగా మెరుస్తునాయి.... ఆ పాప కళ్ళలాగే ......!!!
* * *
భగవంతుడు కూడా ఇలాగే అసలు ముత్యాలయిన ఆనందం... ప్రేమ... ప్రకృతి పట్ల ఇష్టం…. సంగీతం పట్ల ఆరాధన.... కరుణ... ఆప్యాయత లాటి గుణాల్ని ‘ఇవ్వటానికి’ సిద్ధంగా వుంటాడు.
కానీ మనమే తాత్కాలిక ఆనందాన్నిచ్చే అసూయ... ద్వేషం... కోపం... స్వార్ధం... శాడిజం... లాంటి నకిలీ ముత్యాల్ని పట్టుకుని అవే ‘నిజమైన’వనుకుని ఆనందం పొందుతూ వుంటాం.....! వాటిని వదిలేస్తే తప్ప నిజమైనవి దొరకవని తెలుసుకున్న మనిషే ధన్యుడు
Courtesy : krishna Murthy Tenneti garu

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy