నవీనము

19, జనవరి 2016, మంగళవారం

అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు



మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని;
పై నున్న పచ్చని పటమువాఁడు;
గండభాగంబులఁ గాంచన మణి మయ;
మకరకుండలకాంతి మలయువాఁడు;
శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి;
కన్నుల నునుఁ గెంపు కలుగువాఁడు;
బాలార్కమండల ప్రతిమాన రత్న హా;
టక విరాజిత కిరీటంబువాఁడు;

కంకణాంగద వనమాలికా విరాజ
మానుఁ డసమానుఁ డంగుష్టమాత్రదేహుఁ
డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ
విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు. 

భావము: అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తాపానికి కనలుతున్నాడు. శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్థన మన్నించి అంగుష్ఠ మాత్రుడై గదాధారియై ఇలా ఆవిర్భవించి గర్భస్త బాలకుడిని కాపాడేడు. మేఘంమీద మెరుపుతీగలా, నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడు, చెక్కిళ్ళపై మణులు పొదిగిన మరకకుండలాల పసిడికాంతుల ప్రసరించేవాడు, ఆ బ్రహ్మాస్త్ర అగ్ని జ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల కళ్ళు రవ్వంత జేవురించిన వాడు, ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలిన రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు, కంకణాలతో, భుజకీర్తులతో, వనమాలికలతో విరాజిల్లేవాడు, అంగుష్ఠమాత్ర దేహుడు అయిన శ్రీమహావిష్ణువు గదాధరుడై కన్నులపండువుగా ఆ సమయంలో గర్భంలోని అర్భకుని ముందు అవిర్భవించాడు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy